వరుసకు అన్నాచెల్లెళ్లు.. కానీ ప్రేమించుకున్నారు

కొన్ని సందర్భాల్లో చోటు చేసుకునే సంఘటనలు చాలాచిత్రంగా అనిపిస్తాయి. సాధ్యమా అనిపించేలా ఉన్న ఇలాంటి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వరుసకు అన్నా చెల్లెళ్లు అయ్యే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇంకేదైనా ఫర్లేదుకానీ.. చూస్తూ.. చూస్తూ ఇలాంటివి ఎలా ఒప్పుకుంటామని పిల్ల.. పిల్లాడి తల్లిదండ్రులు గట్టిగా చెప్పటం.. తాను కోరుకున్న ప్రేమ లభించకపోవటంతో సదరు యువతి ఆత్మహత్యాయత్నం చేయటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. కాస్త చిత్రంగా.. మరికాస్త ఇబ్బందిగా  అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..

శ్రీకాకుళం జిల్లా సంతకవిటికి చెందిన 20 ఏళ్ల యువతి అదే గ్రామానికి చెందిన పెద్దనాన్న కొడుకు ప్రేమలో పడింది. కుర్రాడి తల్లిదండ్రులు విజయనగరంలో ఉంటున్నారు. యువతి అప్పుడప్పుడు పెద్దనాన్న ఇంటికి వచ్చిన క్రమంలో వారి మధ్య ప్రేమ మొదలైంది. దీంతో.. ఇద్దరూ కలిసి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఈ విషయంపై ఇరు వర్గాల పెద్దలకు తెలిసి.. తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సదరు యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపారు. వీరి వ్యవహారం ఇరు వర్గాల పెద్దల మధ్య గొడవలకు కారణమైంది. యువతికి తల్లిదండ్రులు ఎంతగా నచ్చజెప్పినా ఆమె ససేమిరా అనటంతో ఈ వ్యవహారాన్నిఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.

మరోవైపు.. ఈ ఉదంతం గురించి తెలిసిన పోలీసులు సదరు యువతి వాంగ్మూలం తీసుకున్నారు. వరుసకు ఇద్దరూ అన్నాచెల్లెళ్లు కావటంతో కేసు నమోదు చేయకుండా.. కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ