విశ్వనాథ సత్యనారాయణ

విశ్వనాథ సత్యనారాయణ (1895-1976) “కవి సమ్రాట్” బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు – ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. విశ్వనాధ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించాడు.

జీవిత విశేషాలు

విశ్వనాథ సత్యనారాయణ 1895, సెప్టెంబరు 10న (మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి)[3] ) కృష్ణా జిల్లా నందమూరు గ్రామం (నేటి ఉంగుటూరు మండలం)లో జన్మించాడు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. ఈయన భార్య వరలక్ష్మమ్మ. విద్యాభ్యాసము నందమూరు, ఇందుపల్లి, మరియు పెదపాడు గ్రామాల్లోను, పై చదువులు బందరు పట్టణంలోను సాగాయి. బందరు హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించడం ఆయన అదృష్టం. బి.ఎ. తరువాత విశ్వనాథ సత్యనారాయణ బందరు హైస్కూలులోనే ఉపాధ్యాయునిగా చేరాడు. ఉద్యోగం చేస్తూనే మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా సాధించాడు. తరువాత మహాత్మా గాంధీ నడపుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాడు.
తరువాతి కాలంలో ఈయన వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించాడు. బందరు నేషనల్ కాలేజి (1928), గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1938 వరకు), విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.&‍ సి.వి.ఆర్. కాలేజి (1938-1959)(ఈ కళాశాల ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల గా మార్పు చెందింది), కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో ఆయన పని చేసాడు. 1957లో విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడుగానూ, 1958లో విధానమండలికి నామినేటెడ్ సభ్యుడుగానూ విధులు నిర్వర్తించాడు.

సాహితీ ప్రస్థానం

1961 లో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాలుగా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసాంగానికి కేటాయించాడు. 1916 లో “విశ్వేశ్వర శతకము” తో విశ్వనాథ రచనా ప్రస్థానము ప్రారంభమైనది. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆసమయంలోనే “ఆంధ్రపౌరుషము” రచించాడు. 1920నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.
తరువాత విశ్వనాథ రచనా పరంపర పుంఖానుపుంఖాలుగా కొనసాగింది. మొత్తానికి 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 88 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శనా గ్రంధాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు – ఇలా తెలుగుభాషకు విశ్వనాథ వందల్లో రచనలందించాడు. ఆయన రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు. రేడియో కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించాడు.

ముఖ్య రచనలు

విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి – ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి. తెలుగు తనమన్నా, తెలుగు భాషన్నా విశ్వనాధకు ప్రత్యేక అభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి ఆయన మొదటి రచనలలోనివి. విశ్వనాధ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రిక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి.
తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పాడు. కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు (ఆనాటి) యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశాడు.

పురస్కారాలు

  • ఆంధ్రజాతి తన సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయనను “కవి సామ్రాట్” బిరుదుతో సత్కరించింది.
  • 1964లో ఆంధ్రా యూనివర్సిటీ “కళాప్రపూర్ణ” తో సన్మానించింది.
  • 1942 సంక్రాంతికి ఆయనకు గుడివాడలో “గజారోహణం” సన్మానం జరిగింది.
  • శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది.
  • కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది.
  • 1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది.
  • 1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం తో గౌరవించింది.
  • జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. 1971లో ఆయన “రామాయణ కల్పవృక్షము”నకు ఈ పురస్కారము లభించింది.
(మూలం వికిపీడియా నుండి తీసుకొనబడినది.)

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ