పల్లెటూరు

మా ఊరు ఒక అందమైన పల్లెటూరు. పచ్చపచ్చని పంట పొలాలతో, నిండైన పాడి తో,  పొలం పనులకు వెళుతున్న రైతుల తో కళకళలాడుతూ ఉండేది.
మా ఊరి నడిబొడ్డున రామాలయం, దానికి ఎదురుగా రావి చెట్టు కింద చిన్న ఆంజనేయస్వామి గుడి, దానికి ఎదురుగా నిండైన చెరువు, ఆ చెరువు లో ఒక పక్క ఈత కొడుతూ పిల్లలు, మరొక పక్క బట్టలు ఉతుకుతూ పల్లె పడుచులు , వాళ్ళ తో పరాచికాలు ఆడుతూ అక్కడక్కడే తిరిగే కుర్రాళ్ళు ఓహ్ చూడడానికి రెండు కళ్ళు చాలవు.
అటువంటి చక్కని ఊరిలో పుట్టిన నేను అందరి పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ పెరిగాను. కోతి కొమ్మచ్చి ఆడటం, గడ్డి వాము పై నుంచి దూకడం, కబడ్డి ఇలా మొదలైన ఆటలు ఆడేవాళ్ళం. స్నేహితులం అందరం కలసి ఒక ఉమ్మడి కుటుంబం లా ఉండేవాళ్ళం.
అలా మేము పెద్ద చదువులు చదువుకున్నాం. ఉద్యోగ నిమిత్తం గువ్వలు తల్లిని విడిచినట్లు , తల్లి లాంటి మా ఊరి ని విడిచి వచ్చేశాం. స్నేహితులం అందరం చెట్టుకొకరు పుట్టకొకరు గా అయిపోయాం.  ఇప్పటకీ మా ఊరికి వెళితే అరె! నువ్వు పలానా వారి అబ్బాయి కదా అని గుర్తు పడతారు. కానీ అక్కడ మా తోటి వాళ్ళు ఎవరూ ఉండరు. ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్లుగా ఉంటుంది. ఒక్క సారైనా స్నేహితులం అందరం కలుసుకోవాలని ఉంటుంది.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ