హనుమాన్‌ చాలీసా పుట్టుక

తులసీదాసు రామభక్తుడు. నిరంతరం రామనామస్మరణలో, రామనామగానంలో మునిగి, బ్రహ్మానందం పొందేవాడు. ఆయనే కాదు, ఆ గానామృతానికి పరవశించిపోయిన అనేకమంది, తులసీదాస్‌ దగ్గరకు వచ్చి రామనామ దీక్ష తీసుకుని, నిరంతరం శ్రీరాముని స్మరిస్తూ ఆనందంలో ఓలలాడేవారు. కేవలం హిందువులే కాదు, ఇతర మతాలవారు కూడా తులసీదాస్‌ వద్ద రామనామ దీక్ష తీసుకోవడం, రామ భజన చేయడం ప్రారంభించారు. ఇది సహజంగానే ఆయా మతగురువులకు ఆగ్రహం తెప్పించింది. మతచాందసవాదులు కొందరు, కబీరు మా మతాన్ని కించపరచి, మతమార్పిడులకు పాల్పడుతున్నాడని పాదుషాకి నేరారోపణ పత్రాలు సమర్పించారు. ఆపరిస్థితులలోనే ఒక సంఘటన జరిగింది.
ఒకరికొకరుగా జీవించే చిలకాగోరింకల్లాంటి జంట ఒకటి ఉంది. అతను హఠాత్తుగా కన్నుమూశాడు. అతని భార్య దుఃఖం వర్ణనాతీతం. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ, శోకమూర్తిలా ఉన్న ఆమెను చూసి అందరికీ మనసు అర్ద్రమైంది. కానీ ఎవరు మాత్రం ఏం చేయగలరు! పోయిన ప్రాణం తెప్పించే శక్తి ఎవరికి ఉంది!
అంత్యక్రియలకు సన్నాహాలు చేశారు. భర్తశవాన్ని తీసుకుపోనీయకుండా అడ్డుకుంటున్న ఆ అమ్మాయిని బంధుమిత్రులు కలిసి బలవంతంగా ఆపగా, శవయాత్ర ముందుకు నడిచింది. కానీ, కొద్దిసేపటికే ఆ అమ్మాయి పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగుపరుగున శవయాత్రసాగే ప్రదేశానికి చేరుకుంది. అప్పటికి ఆ శవయాత్ర తులసీదాస్‌ ఆశ్రమం ముందునుంచి వెళుతోంది. ఆ ఆశ్రమము చూడగానే, ఆమెకు ఏమనిపించిందో! తన భర్తని బ్రతికించగల మహానుభావుడు అక్కడ ఉన్నాడనుకుందేమో! ఆ ఆశ్రమములోని భక్తుడు శ్రీరామచంద్రుని అనుగ్రహమువల్ల తన శోకం రూపుమాపగలడనుకున్నదేమో! ఏమనుకుందో ఏమోగాని, ఆ అమ్మాయి హఠాత్తుగా ఆ ఆశ్రమములోనికి వెళ్ళి, తులసీదాస్‌ పాదాలమీద వాలి శోకించింది.
నుదుటబొట్టు, చేతులకు గాజులు మొదలైన సౌభాగ్య చిహ్నాలతో ఉన్న ఆమెను చూసిన తులసిదాస్‌, దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. ఆ దేవెనకి ఆమె మరింతగా శోకించింది. సౌభాగ్యవతీ! ఎందుకు నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. కారణం చెప్పమ్మా! అని అనునయంగా పలికాడు తులసిదాస్‌‌. నాబోటి నిర్భాగ్యురాలిని - దీర్ఘసుమంగళీభవ అని దీవించారు స్వామీ! మీబోటి మహానుభావుల దేవెన నిష్పలమైంది కదా! అంటూ కుమిలి పోయింది ఆ ఇల్లాలు. శ్రీరామచంద్రుడు నానోట అసత్యం పలికించడమ్మాఅ! ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు తులసీదాస్‌. మా ఆయన చనిపోయారు. ఆ వెళుతున్న శవయాత్ర ఆయనదే. ఇక నా సౌభాగ్యమునకు అర్థమేముంది అంటూ భోరుమంది ఆ అమ్మాయి. తులసిదాసు హృదయము జాలితో నిండిపోయింది. ఆయన వెంటనే ఆ శవయాత్ర దగ్గరకు వెళ్ళి, శవవాహకులను ఆగమన్నాడు. వారు ఆగిపోయారు. ఆ శవం కట్లు విప్పి, ఆ రామభక్తుడు రామనామాన్ని జపించి, తన కమండలములోని జలాన్ని శవంమీద జల్లాడు.
అంతే! అద్భుతం జరిగింది. శవంలో జీవం వచ్చింది. అటూ ఇటూ కదిలి కళ్ళు తెరిచాడు. చైతన్యవంతమైన అతనిని చూసిన ఆతని భార్య ఆనందబాష్పాలు రాలుస్తూ, తులసీదాసు పాదాలపై వాలిపోయింది. బంధుమిత్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఈ సంఘటన తర్వాత రామనామదీక్ష తీసుకునేవారి సంఖ్య అమితంగా పెరిగిపోయింది. దీంతో ఇతర మతగురువులు డిల్లీ పాదుషావారి దగ్గరికి వెళ్ళి, తులసీదాసు మతమార్పిడికి ప్రోత్సహిస్తున్నాడని అభియోగం మోపారు. విచారించడానికై తులసీదాసుని పిలిపించాడు పాదుషా. వారి మధ్య జరిగిన సంఘటనలో, రామనామం ఎంతో శక్తివంతమైనదని, రామనామస్మరణ ద్వారా దేనినైనా సాధించవచ్చని చెప్పాడు తులసీదాసు. మరణించినవారిని బ్రతికించగలదా మీ రామనామం అని అడిగాడు పాదుషా. తప్పకుండా అని జవాబిచ్చాడు తులసీదాసు. మేము ఇప్పుడే ఒక శవాన్ని తెప్పిస్తాము. మీ రామనామ మహిమతో బ్రతికించగలరా అని సవాలు చేశాడు పాదుషా. రామనామం చాలా మహిమ కలది. చనిపోయిన వ్యక్తిని బతికించగలదు. కానీ జననమరణాలు వ్యక్తి కర్మలమీద, దైవనిర్ణయం మీద ఆధారపడి ఉంటాయు. వాటి విషయం మానవమాత్రులమైన మనం కలిగించుకోవడం తప్పు కదా! అన్నాడు తులసీదాసు. ఇన్ని మాటలు వద్దు. రామనామానికి మహిమ లేదని చెప్పు. లేదా శవాన్ని బతికించు. అంతే అని కఠినంగా ఆజ్ఞాపించాడు పాదుషా.
రామచంద్రా! ఇదేమి పరీక్ష! రాజు కన్నెర్ర చేస్తున్నాడు. అంత మాత్రాన ఇతను చెప్పిన పని చేయలేను కదా! రామా! ఈ విపత్తు నుండి నీవే నన్ను రక్షించాలి రామా! అని మనసులోనే వేడుకుంటూ కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నుడైయ్యాడు తులసీదాసు. సమాధానం చెప్పకపోవడం, కళ్ళు మూసుకుని ఉండటం, కనీసం తన తప్పు కాయమనుకోవకపోవడం, శరణు వేడకపోవడం, ఇవన్నీ పాదుషాకి కోపం తెప్పించాయి. తులసీదాస్‌ని బంధించమని ఆజ్ఞాపించాడు. తులసీదాసు వైపు సైనికులు కదిలారు. మనసా, వాచా, కర్మణా - త్రికరణశుద్ధిగా తననే నమ్మే ఆ భక్తునికి , ప్రతిక్షణం రామనామస్మరణ చేసే తన సేవకునికి, ప్రాణపాయసమయంలో కూడా తన మీదే భారం వేసిన ఆ మహానుభావునికి అపాయం చుట్టుముడుతుంటే రామభద్రుడు ఊరుకుంటాడా! తక్షణమే తన సైన్యాన్ని పంపించాడు.
ఎక్కడినుండి వచ్చాయో తెలియదు గానీ, వందలు, వేలుగా కోతులు అక్కడికి వచ్చాయి. సైనికులమీద పడి, వారి దగ్గర ఆయుధాలను గుంజుకుని వారిమీదకే గురిపెట్టాయి. సభికులు, సైనికులు, పాదుషా, ఎవ్వరూ కదలలేదు. ఏ కోతి మీదపడి కరుస్తుందో అనే భయంతో సభికులు భయాందోళనలకు గురయ్యారు. సభలో కలకలం రేగింది. ఆ సవ్వడికి కనులు తెరచిన తులసీదాసుకి సైనికులకి ఆయుధాలు గురిపెట్టిన వానరాలు కనిపించాయి. అవి కోతులు కాదు, రామదండు. తులసీదాసు ఆశ్చర్యంతో, ఆనందంతో చుట్టూ పరికించాడు. ఎదురుగా సింహద్వారం మీద కూర్చొని అభయహస్తాన్ని చూపుతున్న ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. తులసీదాసు భక్తిభావంతో తన్మయుడయి, స్వామికి చేతులు జోడించి స్తుతించాడు. ఆయన నోటినుండి అప్రయత్నంగా, ఆశువుగా జయహనుమాన జ్ఞానగుణసాగర అంటూ హనుమాన్‌ స్తుతి ప్రవహించింది. అదే హనుమాన్‌ చాలీసా.
తులసీదాసు స్తుతికి హనుమంతుడు ప్రసన్నుడయి, ఆ భక్తుని అనుగ్రహించాడు. నాయనా! నీస్తుతితో మరింత ప్రసన్నం చేసుకున్నావు. బిడ్డా! ఈ మూకని సంహరించాలా? తరిమికొట్టాలా? నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తాను అని అన్నాడు స్వామి.
చేతులు జోడించి భక్తిగా తలవాల్చాడు తులసీదాసు. స్వామీ! ఇప్పటికే ప్రాణాలరచేతిలో పెట్టుకున్న వీరిగురించి నేనేమీ అడగను. ఇప్పటికే వీరికి అజ్ఞానం తొలగిపోయింది. కానీ, ఒక్క ప్రార్థన. ప్రభూ! ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు స్తుతించినా వారికి ప్రసన్నుడ వవు స్వామీ! నాకు ఈ వరాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ మాటలకు స్వామి మరింత ప్రసన్నుడయ్యాడు. తథాస్తు అని అనుగ్రహించాడు.
నాటి నుంచి హనుమాన్‌ చాలీసా చదివిన వారికి స్వామి ప్రసన్నుడయి అనుగ్రహిస్తున్నాడు.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ