విశ్వాసమంటే ఇదే... నిద్రిస్తున్న యజమానిని రక్షించేందుకు పులితో పోరాడి ప్రాణాలు వదిలిన శునకరాజం

తాను నమ్మిన యజమాని ప్రాణాలను కాపాడేందుకు ఆ శునకం ఓ పులితో పోరాడి ప్రాణాలను వదిలింది. ఈ ఘటన షాజహాన్ పూర్ సమీపంలోని దుడ్వా జాతీయ పార్కును ఆనుకుని ఉన్న గ్రామంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బర్బత్ పూర్ గ్రామంలోని రైతు గురుదేవ సింగ్, జాకీ అనే శునకాన్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. తన ఇంటి బయట గురుదేవ్ నిద్రిస్తుండగా, పక్కనే ఉన్న అడవిలో నుంచి ఓ పెద్దపులి వచ్చింది. పెద్దపులిని పసిగట్టిన శునకం పెద్దగా అరుస్తూ, తన యజమానికి ముంచుకొచ్చిన ప్రమాదాన్ని తెలియజేస్తూ, దానిపై కలబడింది. గురుదేవ్ లేచి సహాయం కోసం ఇతరులను పిలిచేలోగా, పులి పంజా దెబ్బలకు ఆ శునకం తీవ్రంగా గాయపడగా, దాన్ని ఆ పులి అడవుల్లోకి లాక్కెళ్లింది. గురుదేవ్ కుటుంబం, గ్రామస్తులు శునకం కోసం వెతుకులాడగా, కొంతదూరంగా దాని మృతదేహం కనిపించింది. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిపిన గురుదేవ్, శునకం విశ్వాసాన్ని తలచుకుంటూ, దాని అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు. జాకీ ఓ వీధి శునకమని, నాలుగేళ్ల క్రితం చిన్న పిల్లగా ఉన్నప్పుడు తన పిల్లలు ఇంటి తేగా, ఇంట్లోని మనిషిలా కలిసిపోయిందని గురుదేవ్ తెలిపారు.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ