కృష్ణాష్టమి

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.

పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.

భగవానుడు సామాన్య జనులమధ్య సామాన్య మానవుడి రూపంలో జన్మించి నివురుగప్పిన నిప్పులా దినదినాభివృద్ధి చెందుతూ ధర్మానికి ఆటంకం కలిగించే శక్తులను తనలో ఉన్న మధ్యాహ్న సూర్యకాంతితో ఒక మండించే శక్తిలా, ఆ దుష్టశక్తులను నశింపచేస్తూ సామాన్య జనులకు ఊరట కలిగిస్తూ మానవులందరు తిరిగి ఎలాకలిసి మెలిసి జీవించాలో జ్ఞానబోధను చేస్తూ ముందుకు సాగిపోతుంటారు.

ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్థమాన మగుచూ తన లీలావినోదాదులచే బాల్యమునుండే, అడుగడుగునా భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు.

అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట. వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లని కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ వుంటారు.

అలాగునే మరోచిన్నారి చేష్టలో మరో సందేశాన్ని చెప్తారు. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూవుంటే, రాళ్లను విసిరిచిల్లు పెట్టేవాడట. అలా ఆకుండ మానవశరీరము అనుకుంటే ఆకుండలోని నీరు 'అహంకారం' ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని అంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.

ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్టశిక్షణ శిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారధియై అర్జునిలో ఏర్పడిన అజ్ఞానందకారాన్ని తొలగించుటకు "విశ్వరూపాన్ని" చూపించి గీతను బోధించి, తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు. ఇలా కృష్ణతత్త్వాన్ని కొనియాడి చెప్పుటకు వేయితలలు కలిగిన ఆదిశేషునికే సాధ్యముకాదని చెప్తారు.

ఇంకా, ప్రముఖ భాగవతోత్తములు మనకు అందించే సమాచారాన్ని బట్టి యిప్పటికి సుమారు 30వ శతాబ్దమునకు పూర్వం అంటే క్రీస్తు పూర్వం 3122లో ద్వారకా పట్టణమందు కృష్ణభగవానుడు నిర్యాణము చెందినట్లు తెలియుచున్నది. నాటినుండే కలి ప్రవేశముతో "కలియుగం" ఆరంభమైనదని చెప్తారు.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ