వరలక్ష్మి వ్రతము

సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి స్త్రీలకు తగిన మార్గాన్ని ఉపదేశించమని పార్వతీదేవి శివుడిని కోరినప్పుడు, ఆ ముక్కంటి వరలక్ష్మీ వ్రతాన్ని గురించి చెప్పినట్లు శాస్త్రాలు వెల్లడించాయి. స్త్రీల ఆధ్యాత్మిక జీవన విధానంలో ఒక భాగమైపోయిన 'నోములు - వ్రతాలు'లో ముందుగా 'శ్రీ వరలక్ష్మీ వ్రతం' గురించి తెలుసుకుందాం.

సంపద వుంటే సగం సమస్యలు దూరమైనట్టే. అలాంటి సంపద లభించాలంటే సకల సంపదలకు పుట్టినిల్లు అయిన 'శ్రీ వరలక్ష్మీ దేవి' అనుగ్రహం ఉండాలి. అందుకోసం 'శ్రీ వరలక్ష్మీ వ్రతం' ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించే వారు ... ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టి పీఠంపై అమ్మవారి ప్రతిమను ... కలశాన్ని పసుపుతో అమ్మవారిని సిద్ధం చేసుకున్నాక ఆచమనం చేయాలి. దీపారాధన చేసి దీపానికి నమస్కరించాలి. గణపతి ప్రార్ధన ... ప్రాణాయామం చేసి సంకల్పం చెప్పుకోవాలి. కలశారాధన చేసి ... అమ్మవారిని ధ్యానించి ఆవాహన చేయాలి.

అమ్మవారికి సింహాసనాన్ని సమర్పించి అర్ఘ్య పాద్యాలను ఇవ్వాలి. ఆ తరువాత పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించి .. శుద్ధోదక స్నానం చేయించి వస్త్రాభరణాలు .. పసుపు కుంకుమలు .. పూలు .. గంధం .. అక్షితలు సమర్పించాలి. ఆ తరువాత వరలక్ష్మీ అష్టోత్తరం చదువుకుని, ధూప .. దీప .. నైవేద్యాలను సమర్పించాలి.

ఈ వ్రతం యొక్క కథ :
ఈ వ్రతం ఆచరించడానికి అవసరమైన ఈ కథను చెప్పుకోవాలి. పూర్వం మగధదేశంలోని ఓ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన 'చారుమతి'అనే ఇల్లాలు వుండేది. ఆమె వరలక్ష్మీ దేవి భక్తురాలు. భర్త మనసెరిగి నడచుకోవడమే కాకుండా, అత్తమామలను తల్లిదండ్రులవలే ఆదరిస్తూ వుండేది. నిరంతరం ఇంటి పనుల్లో నిమగ్నమవుతూనే, వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తూ ఉండేది. చారుమతి వినయ విధేయతలు ... భక్తి ప్రపత్తులకు మెచ్చిన వరలక్ష్మీ దేవి కలలో కనిపించి ఆమెపట్ల తనకి గల అనుగ్రహాన్ని తెలియజేసింది. 'శ్రావణ పౌర్ణమి' కి ముందు వచ్చు 'శుక్రవారం' తన వ్రతమును ఆచరించించడం వలన సకల శుభాలు కలుగుతాయని చెప్పింది. మరునాటి ఉదయం తనకి వచ్చిన కల గురించి చారుమతి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వాళ్లంతా కూడా అమ్మవారు చెప్పినట్టుగా చేయమని ఆమెను ప్రోత్సాహించారు. దాంతో చారుమతి తమ ఇంటి చుట్టుపక్కల వారికి ఈ విషయం చెప్పింది. ఆ రోజున అందరూ రావాలని ఆహ్వానించింది. 'శ్రావణ శుక్రవారం' రోజున అంతా చారుమతి ఇంటికి చేరుకున్నారు.

అప్పటికే ఆమె అమ్మవారి కోసం పీఠాన్ని సిద్ధం చేసి దానిపై కలశాన్ని ఉంచింది. ఆ తరువాత షోడశోపచారాలతో అమ్మవారిని పూజించి ... తొమ్మిది పోగుల తోరమును ధరించి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించింది. దాంతో ఆమెతో పాటు మిగతా వారు కూడా ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టారు. అలా వాళ్లు ఒక్కో ప్రదక్షిణ చేస్తుండగా వాళ్ల ఇళ్లలో సిరిసంపదలు పెరిగిపోసాగాయి. మూడు ప్రదక్షిణలు పూర్తి కాగానే వాళ్లందరి ఇళ్లు ధన కనక వస్తువులతో నిండిపోయాయి. అమ్మవారి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసిన వీళ్లంతా, ప్రతి ఏడాది చారుమతి చేసిన తరహాలోనే వరలక్ష్మీ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు. ఈ వ్రతం చేసినా .. చూసినా .. కనీసం విన్నా .. సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ