సంక్రాంత్రి

హిందువులు జరుపుకునే ముఖ్య పండగల్లో సంక్రాంత్రి పండగ ఒకటి. ఈ పండగ ప్రతి సంవత్సరం జనవరి మాసంలో వస్తుంది. సంక్రాంతికి శాస్త్రపరంగా ప్రత్యేకత ఉంది. నక్షత్రాలు ఇరవై ఏడు. మళ్లీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి సంక్రాంతిగా వ్యవహరించబడుతుంది.

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు ప్రాణాధారమైనవాడు. సూర్యకాంతితో చంద్రుడు ప్రకాశిస్తాడు. ఒకరు శక్తి మరొకరు పదార్థము. మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుడు కర్కాటక రాశ్యాధిపతి. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో కర్కాట సంక్రమణంలో ప్రవేశిస్తాడు. అది దక్షిణాయనం. ఇంద్రుడు తూర్పు దిక్కునకు అధిపతి. వరుణుడు పడమరకు అధిపతి. వీరిద్దరి వాహనాలు ఐరావతము, మకరము. సూర్యుడు ధనుర్రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిలో ప్రవేశించేవరకు దేవతలకు పగలుగా ఉంటుంది. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించింది మొదలు ధనురాశిలో ప్రవేశించేవరకు దేవతలకు రాత్రి. ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది.

కనుకనే దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి దేవతల అనుగ్రహాన్ని పొందమని పండితులు చెబుతున్నారు. మకర సంక్రాంతి.. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటాడు. రవి ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు.

సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున "భోగి" పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధన, ధాన్యలక్ష్మిలు కొలువై ఉంటారు కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

మూడు రోజులపాటు జరిగే ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో వైభవంగా నిర్వహిస్తారు. భోగిరోజున తెల్లవారకముందే గ్రామంలోని నాలుగు వీధుల కూడలిలో భోగిమంటలు వెలిగిస్తారు. ఇంట్లో పేరుకుపోయిన పాత పుల్లలు, చెక్కముక్కలన్నీ తీసుకొచ్చి ఈ మంటల్లో వేస్తారు. భోగి మంటల పరమార్థం ఏమిటంటే... ఆ మంటల ద్వారా చలిని పారద్రోలటమేగాకుండా.. ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తుంటారు.

ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటుచేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు. దీనికి ప్రతిగా వారంతా రేగిపళ్లు, పువ్వులు, రాగి నాణాలను చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు. రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఈ మూడురోజులపాటు కొత్తబట్టలను కొనుక్కుని కట్టుకోవటంతోపాటు, అనేక పిండివంటలతో విందు చేసుకుంటారు.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ